September 17, 2025 |
Category: Politics
45 views
సంగారెడ్డి జిల్లా జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య , రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్ (RRR), రోడ్ ఓవర్ బ్రిడ్జీలు (ROBs) నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (NIMZ) కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు .
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ --- భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (NIMZ) కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NICDC) తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGIIC)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) మేరకు, NIMZలో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు.